ఉచిత విద్యుత్తు దరఖాస్తుల ధ్రువీకరణకు శ్రీకారం
ఉచిత విద్యుత్తు దరఖాస్తుల ధ్రువీకరణకు శ్రీకారం
హైదరాబాద్(టైమ్‌టుడే): రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీలో భాగంగా పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇచ్చే పథకం గృహజ్యోతి. ఇందుకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వినియోగదారుల ధ్రువీకరణతో పాటు దరఖాస్తు చేసుకో లేకపోయిన వారి ఆహార భద్రత కార్డు, ఆధార్, మొబైల్ నంబర్ల సేకరణను విద్యుత్తు పంపిణీ సంస్థ మొదలెట్టింది. మీటర్ రీడింగ్ యంత్రంలోనే ఈ వివరాలు నమోదు చేసేలా సాఫ్ట్ వేర్ రూపొందించారు. తరువాతే బిల్లు జారీ అయ్యేలా చేశారు. ఈ ప్రక్రియ నగరంలో మంగళవారం ప్రారంభమైంది. పది రోజుల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూఖి హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ సెక్షన్లో బిల్లింగ్ తో పాటు గృహ జ్యోతి దరఖాస్తుల ధ్రువీకరణ, సమాచార సేకరణ తీరును పరిశీలించారు. మీటర్ రీడర్లు, ఇంజనీర్లకు సూచనలు చేశారు. తొలిరోజు వినియోగదారుల నుంచి అంతంత మాత్రం స్పందనే వ్యక్తం అయింది. గృహ జ్యోతి పథకానికి ప్రజా పాలనలో మూడు జిల్లాల పరిధిలో 19.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన సమాచారంలో కొన్ని సరిపోలడం లేదని కార్పొరేట్ కార్యాలయం గుర్తించింది. ఈ తరహాలో 40% వరకు దరఖాస్తులు ఉన్నాయి. వీటిని ధ్రువీకరించుకునేందుకు, అవసరమైన వివరాల నమోదును ఈ నెల బిల్లింగ్ తో అనుసంధానం చేశారు. మీటర్ రీడర్లో విద్యుత్తు కనెక్షన్ నంబరు కొట్టగానే.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ వివరాలు వస్తున్నాయి. వినియోగదారుల నుంచి మరోసారి వాటిని ధృవీకరించుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆధార్ నంబరును నమోదు చేస్తున్నారు.
