యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువజన దినోత్సవ వేడుకలు

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యువత జిల్లాకు పేరు తీసుకురావాలి

యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువజన దినోత్సవ వేడుకలు
చిత్రపటానికి పూలమాల వేసిన అదనపు కలెక్టర్ రాంబాబు

కొత్తగూడెం(టైమ్‌టుడే):

యువత నేటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలిచేందుకు శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వివేకానందుని చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదవాలని ఆయన సూచించారు. వివేకానందుడు చికాగో నగరంలో జరిగిన సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిందని చెప్పారు. మన సంప్రదాయాలు, సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపారని చెప్పారు. ప్రతి ఒక్కరిలో అద్వితీయమైన శక్తి దాగి ఉందని ఉన్నత స్థాయికి చేరాలన్న సంకల్పానికి కృషి, పట్టుదల అత్యంత అవసరని చెప్పారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని కృషి పట్టుదల ఉంటే యువత ఉన్నత శిఖరాన్ని అధిరోహించొచ్చని ఆయన పేర్కొన్నారు. యువత ఎలాంటి చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గంలో పయనించాలని ఆయన సూచించారు. మన జిల్లా యువత ప్రతిభలో విభిన్న రంగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచి మన జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన పేర్కొన్నారు. రానున్న భవిష్యత్తు అంతా బావి భారత పౌరులుగా యువతదేదని, భారతదేశానికి మీరు మూల స్తంభాలని ఆయన చెప్పారు. యువత మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు. యువత నాకు రాదనే ఆత్మ న్యూనతను విడనాడి కృషి పట్టుదల, పటిష్ట సంకల్పంతో ముందగు సాగాలని ఆయన స్పష్టం చేశారు. యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన అభిలాషించారు.  ప్రపంచ దేశాలకు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తి వివేకానంద అని తెలిపారు. యువత వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ప్రతి ఒక్కరు వారిలో ద్విగుణీకృతమైన శక్తి, సామర్ధ్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. యువత భారతదేశానికి పునాదిరాళ్లని, వారే భావిభారత పౌరులని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, డిపిఆర్ఓ శ్రీనివాసరావు, డి సి ఓ వెంకటేశ్వర్లు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.