టేకులపల్లి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
టేకులపల్లి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
టేకులపల్లి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
- 11 మంది ఎంపీటీసీలు ఏకపక్షంగా వ్యతిరేకం

టేకులపల్లి(టైమ్‌టుడే): టేకులపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు భూక్యా రాధ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కొత్తగూడెం ఆర్ డీ ఓ శిరీష బుధవారం టేకులపల్లిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం నెగ్గింది. మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగా వారిలో 11 మంది ఎంపీటీసీలు ఎంపీపీకి వ్యతిరేకంగా కొత్తగూడెం ఆర్ డీ ఓ కు నెలరోజుల క్రితం అవిశ్వాసంపై లేఖ ఇచ్చారు. తీసుకున్న ఆర్ డీ ఓ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు సభ్యులకు నోటీసులు ఇచ్చారు. దీనితో సమావేశానికి ఎంపీపీకి వ్యతిరేకంగా ఉన్న సభ్యులు మాత్రమే హాజరవ్వగా ఎంపీపీ రాధ తో పాటు మరో ఇద్దరు సభ్యులు గైర్హాజరు అయ్యారు. చేతులు ఎత్తే విధానంతో ఆర్ డీ ఓ వోటింగ్ నిర్వహించారు. మొదట అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నవారు చేతులు ఎత్తాలని కోరగా హాజరైన 11 మంది చేతులు ఎత్తారు. వ్యతిరేకంగా కూడా వోటింగ్ నిర్వహించగా ఎవరు చేతులు ఎత్తక పోవడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు. ఆర్ డీ ఓ మాట్లాడుతూ సమావేశం కాపీని జిల్లా కలెక్టరుకు పంపిస్తామని, అంతరం అక్కడి నుంచి వారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారని, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరబాబు, తహసీల్దార్ కృష్ణవేణి పాల్గొన్నారు.
